Showing posts with label Common man. Show all posts
Showing posts with label Common man. Show all posts

Wednesday, December 2, 2009

ఎవరు మీరు?


సోము - సుబ్బారావు - ధీరు

వీరిలో ఎవరు మీరు ?

సోము:

ఈయనకి లెగడమే మహా బద్ధకం
జీవితం అంతా మత్తులోనే గడిపేస్తాడు
సోమూని చూడగానే ఈజీగా గుర్తు పట్టొచ్చు...ఎందుకంటే అధిక బరువు లేక ఊబకాయంతో బాధపడుతూ.. తన శరీరాన్ని బాధపెడుతూ ఉంటాడు
పనిని ఎలా వాయిదా వెయ్యొచ్చో ఈయనకి బాగా తెలుసు
అందులో సోము Phd కూడా చేసాడు.
కష్టపడేవారిని చూసి జాలి పడతాడు
సోము ఎక్కువగా ఉపయోగించే పదాలు: ఆకలి, నిద్ర, నీరసం
పని అంటే పారిపోతాడు
లేదంటే నిద్రపోతాడు
చాలామంది పని దొరక్క ఏడుస్తుంటారు
వీడు పనుంటే ఏడుస్తాడు
అసలు వీడికి తిండి మీదా మంచం మీద ఉన్న ఆసక్తి ప్రపంచంలో దేని మీద ఉండదు

సోము తరచుగా వాడే వాక్యాలు:
"నా వల్ల కాదు"
"ఆ!! నిద్రొస్తోంది... "

సుబ్బారావు:

ఈయన మీకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాడు
అతి సామాన్యుడు.
జీవితాన్ని ఏడుస్తూ.. ఈడుస్తూ..... బ్రతికేస్తుంటాడు
వదులు కోవటం లో ఆనందాన్ని పొందేస్తూ ఉంటాడు
ఈయనికి శరీరం మీద శ్రద్ద వుంటుంది...కానీ అప్పుడప్పుడు మాత్రమే.
ఒకోసారి లావుగా, ఇంకోసారి సన్నగా, మరోసారి మాములుగా కనిపిస్తూ ఉంటాడు
ఈ మార్పులన్నీ తన మీద తనకి మానసికంగా పట్టు లేదని నిరూపిస్తూ వుంటాయి
సుబ్బారావు డిక్షనరీ లోనుంచి తీయలేని పదాలు 'భయం' & 'రాజీ'
అలాగే ఇతని డిక్షనరీ లో దేవుడు దిగి వచ్చినా చేర్చలేని పదం 'ధైర్యం'
ప్రతిదానికీ ఎడ్జెస్ట్ అయిపోవటం బాగా అలవాటు
అది జీతమైనా... జీవితమైనా...
సుబ్బారావుకి స్నేహితులెక్కువే
కాకపొతే అన్నీ పనికిరాని స్నేహాలే
ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్లకు వెళతాడు
ప్రేమతో కాదు, రిలేషన్ ఎక్కడ పోతుందో అన్న భయం తో
ఈయనకి మరో క్వాలిటీ ఉందండోయ్
అదే...అదే... అదేనండి....మొహమాటం!
ఈయన అదేదో పెద్ద క్వాలిఫికేషన్లా ఫీల్ అయిపోతుంటాడు
అసలు సుబ్బారావు సమయం అంతా మొహమాటంతోనే మాయం అయిపోతుంటుంది
కాలం కర్పూరమైపొతున్నా...ఆ జ్ఞానం మాత్రం ఈయనకి బోధపడదు.
ఎప్పుడూ పక్క వాళ్ళు గెలుస్తుంటే
చూసి గంతులేస్తాడు తప్పితే
అలా నేనుందుకు గెలవలేను అని ఆలోచించడు
జీవితాంతం గొప్పవాళ్ళను పొగుడుతూ గడిపేస్తాడు తప్పితే
వాళ్ళు చేసింది ఒక్కటైనా అలవాటుగా మార్చుకోడు
మార్పు అంటే ఇతని దృష్టిలో పెను ముప్పు అని అర్థం
చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేక పోయినా...చేస్తూనే వుంటాడు
పనిలో ఆనందం ఆవిరైపోయినా...ఆవురమంటూ గడిపేస్తాడు
ఈ పని నాకు ఇష్టం లేదని పదిమందితో పదే పదే అంటాడు
కాని తెల్లారితే మళ్లీ అదే పనిలో మూలుగుతూ వుంటాడు

సుబ్బారావు తరచుగా వాడే వాక్యాలు:
"ఆ.. మన జీవితాలింతే"
"దేనికైనా అదృష్టం ఉండాలి"
"అవన్నీ మనవల్ల అవుతాయా"

ధీరు:

ఇతనికి ఆకాశమే హద్దు
ఇతని నిఘంటువు
'కలలు', 'సాహసం',
'శోధించడం', 'సాధించటం' లాంటి పదాలతో నిండిపోయి ఉంటుంది.
మనసు మీద, శరీరం మీద మంచి పట్టు ఉంటుంది.
చూడగానే ఆకట్టుకొనే శరీరాకృతి, చెదరని చిరుమందహాసం ఇతని ఆభరణాలు.
ధీరుకి పుట్టుకతోనే ఆ శరీరాకృతి వచ్చిందనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే
కేవలం అతని సంకల్పం తోనే దాన్ని సాధించాడు.
చిన్నపట్నించి తన దగ్గర ఉన్నవి ఎలా అభివృద్ధి చేసుకోవాలో
లేనివి ఎలా సాధించుకోవాలో బాగా తెలుసు
వజ్ర సంకల్పం ఇతని వరం
ధీరుకి తన ఇష్టాలేంటో,
రాబోయే కష్టాలేంటో,
తన సత్తా ఏంటో,
తనలోని లోపాలేంటో కచ్చితంగా తెలుసు
ఇతనికంటే ఇతని పనే ఎక్కువ మాట్లాడుతూ వుంటుంది
సమయాన్ని గౌరవిస్తాడు
తనకి తాను మంచి స్నేహితుడు
విజయం ఇతనికి చాలా దగ్గర బంధువు

ధీరు తరచుగా వాడే వాక్యాలు:
"నిన్ను నువ్వు నమ్ముకో"
"ఏదీ అసాధ్యం కాదు"

P.S:

ఇదండీ ఈ ముగ్గురి కథ
ఈ ముగ్గురిని వివరించటం లో నా ఉద్దేశ్యం సామాన్యుని కించపరచటం కాదు
ప్రతి వ్యక్తిలోను ఈ మూడు పార్శ్వాలు ఉంటాయి. కాకపోతే మనం ఎంత తొందరగా ఈ మెట్లు ఎక్కుతామన్నది మనలోని గొప్పతనం మీద ఆధారపడుతుంది.
ఒక్కో సమయంలో మనలో సోము డామినేట్ చెయ్యొచ్చు లేకపోతే సుబ్బారావు స్పందిచవచ్చు. ఒకే రోజులో ఈ ముగ్గురూ మనలో ప్రవేశించవచ్చు.
విషయం ఏంటంటే మనకి పాతికేళ్ళు వచ్చేసరికి సోము, సుబ్బారావు మనకి చాలా పాత స్నేహితులైపోవాలి లేదంటే మన జీవితం గందరగోళం, మన కలలు కర్పూరం
ధీరు ఎంత దగ్గరైతే మనం గెలుపుకి అంత దగ్గరవుతాం
ఇప్పుడు చెప్పండి మీలో ఎవరెవరు ఎంత శాతం

నాకైతే ప్రస్తుతానికి
సోము: 15%
సుబ్బారావు: 50%
ధీరు: 35%

అతి తొందర్లో పూర్తిగా ధీరు లో కలిసిపోవాలిని ప్రయత్నిస్తున్నాను
ఇక మీ స్కోరు కోసం ఎదురు చూస్తుంటాను

ఇట్లు
హితుడు
అజయ్ వేగేశ్న


------------------------------------------------------------------------------